Think Big –Get Big
పిండి కొద్దీ రొట్టె – ఆలోచనలను బట్టి సంపద. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు . జ్ఞానం, ఆరోగ్యం కూడా కావచ్చు. ఈ ప్రపంచంలో ప్రతీది రెండుసార్లు సృష్టించబడుతుంది. మొదటిసారి మానవ మస్తిష్కంలో, రెండవసారి బాహ్య ప్రపంచంలో .
మనలో చాలా మంది ఎదుటివారిని చూసి కుంగిపోతుంటారు. తాము అలాలేమే అనో లేక, అలాంటి బంగళా, కారు.. హోదా, గౌరవం. ఆరోగ్యం, తెలివి , జ్ఞానం ఇలా ఏదైనా కావచ్చు. ఈ రకంగా బాధ పడే సందర్భాలు ఎన్నో . కానీ అవన్నీ మనం పొందాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అలాంటి వారికి చెప్పేదేమిటంటే ..... గొప్పగా ఆలోచిస్తే - గొప్పగా పొందగలవు.
గొప్పగా ఆలోచించినంత మాత్రాన గొప్పది లభిస్తుందా ....? కొంత మంది అనుమానం. అవును కేవలం ఆలోచించినంత మాత్రాన లభించదు. కానీ లభించాలంటే మాత్రం గొప్పగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే కోరుకోనిదే ఏదీ లభించదు కదా !. ముందుగా మనసులో కోరిక అనే విత్తనం నాటితే, ఆ తర్వాత దానిని ఎలా సమకూర్చుకోవాలో దానికి కావలసిన మార్గం మన మనసు మనకు సూచిస్తుంది. మనసు యొక్క సూచనలు పాటించి కృషితో ముందుకు సాగితే అనుకున్నది పొందవచ్చు. అంటే మన కృషి తప్పకుండ అవసరమే. కేవలం “కండలు పెంచడం ఎలా..?” అనే పుస్తకం చదవగానే కండలు పెరగవు. జిమ్ కి వెళ్లి బాగా కసరత్తులు చేయాల్సి వుంటుంది. కానీ దేనికైనా ముందుగా కావలసింది మనసులో విత్తనం నాటడం. విత్తనం లేనిదే ఏది మొలకెత్తదు కదా ! మీరు మీ మనసులో నాటే విత్తనం నెగెటివ్వా ? పాజిటివ్వా గమనించండి, దానిపైనే మీ రిజల్ట్ అదారపడివుంటుంది.
గొప్పవారి ఆలోచనలు
- మహాత్మాగాంధీ గొప్పగా ఆలోచించకపోతే మనకు స్వాతంత్రం లభించేదా?
- సైంటిస్టులు గొప్పగా ఆలోచించకపోతే ఇంత సాంకేతిక అభివృద్ది జరిగేదా..?
- వ్యాపారవేత్తలు, కవులు, కళాకారులూ, నాయకులూ ఎవరైనా సరే వారి గొప్ప ఆలోచనల వల్లే ఈ రోజు ఈ ప్రపంచం ఇలా వుంది.
- న్యూటన్ ఆపిల్ పండు వల్ల భూమ్యాకర్షణ శక్తి ని కనుగొన్నాడంటే ఆలోచనవల్లె కదా!
- కొలంబస్ అమెరికాని కనిపెట్టేలా చేసింది కూడా అలాంటి ఆలోచనే.
ఒక మహానుభావుడేమన్నాడంటే..... ఆర్థికంగా పేదరికం పరవాలేదు కానీ , ఆలోచనల్లో పేదరికంసహించరాని నేరమంటాడు. నిజమే కదా! రూపాయి పెట్టుబడి లేకుండా, విద్యార్హతలతో సంబంధం లేకుండా
ఎంత గొప్ప ఆలోచనైనా చెయ్యవచ్చు. ఆ ఆలోచనలకు ఫలితం వ్యక్తిగతంగానే కాకుండా, భవిష్యత్ తరాలకు ఏంటో ఉపయోగపడుతాయి.
దేవుడు వరమిచ్చినా..
ఈ సందర్భంలో మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తీ ఒక చిన్న కంపనీలో అంబాసిడర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న రకరకాల సరికొత్త కార్లను చూసినప్పుడల్లా ఛీ! ఎంతకాలం ఈ జీవితం అని బాధపడి దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమన్నాడు. స్వామి నాకు రెండు కోరికలు. సరే కోరుకోమన్నాడు దేవుడు , ఈ ప్రపంచంలో కెల్లా అద్భుతమైన కారుని సృష్టించండి అన్నాడు. అలాగే ! నీ రెండో కోరిక ఏమిటి అన్నాడు దేవుడు. స్వామి ఆ కారు నడిపే డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి అన్నాడు. దేవుడు అశ్చర్యపోయి ఇదేమిటి కారుకి ఓనర్ ని చేయమంటాడేమోననుకుంటే డ్రైవర్ ఉద్యోగం కావాలంటడేమిటి హు( ఏం చేస్తాం, భక్తుడు కోరుకున్న దానికన్నా ఎక్కువిచ్చే అధికారం నాకు కూడా లేదు కదా ! అనుకుని తదాస్తు అన్నాడు.
దేవుడు వరమిచ్చినా కోరుకోవడానికి కూడా దమ్ములేకపోతే ఎలా...? ఇలాంటి వారు స్వయంకృషితో ఎలా సాధిస్తారు. మనలో చాలా మంది ఈ డ్రైవర్ లాగే గొప్ప ఆలోచనలు చేయడానికి సాహసించరు. ఆలోచనలు ఎంత పూర్ గా ఉంటె ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే అన్నాడు అబ్దుల్ కలాం. “కలలు కనండి - సాకారం చేసుకోండి.” అని.
పక్కదారి కలలు
యువకుల్లో కొంతమంది అద్భుతాలు సాధిస్తుంటే ఎక్కువ శాతం మంది పనికిరాని కలలతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రేమ కోసం, అమ్మాయిల కోసం కలలు కంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందులో విఫలమైతే డిప్రెషన్ లేదా ఆత్మహత్య . అదే అమ్మాయి అయితే ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకొమ్మని ధర్నా. మోసగాడు అని తెలిసినా పెళ్లి కోసం పోరాడుతున్నారంటే ఏమనుకోవాలి. అంతే ఇక ఇక్కడితో కెరీర్ కి పులిస్టాప్ . ఇక సాదా సీదా జీవితమే. గొప్ప ఆలోచనలున్నవారు తమ కలల్ని ప్రేమిస్తారు.
ఉహల్లో భవిష్యత్తు
యువత తమ ఉహల్లో వారు కోరుకున్న భవిష్యత్తును ఉహించగలగాలి. అంటే భవిష్యత్తులోకి తొంగి చూడాలి. ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో తామనుకున్న రీతిలో ఉంటామో తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తనా లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగితే విజయం తప్పక లభిస్తుంది.
ఆకర్షణా/ కెరీరా...?
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. విజయం వద్దనుకునే వారు ఎవరూ ఉండరు. కానీ ఎప్పుడో వచ్చే విజయం కన్నా ఇప్పుడు కళ్ళ ముందున్న ఆకర్షణలు మిన్నగా కనిపిస్తాయి. ఇక్కడే చాలా మంది బోల్తాపడి తమ జీవితాలను ఎందుకూ కొరగాకుండా చేసుకుంటున్నారు. ఆ ఆకర్షణలు ప్రేమ కావచ్చు, సెక్స్ కావచ్చు , సినిమాలు, క్రికెట్ పిచ్చి , కావచ్చు. పైగా కొంతమంది ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఇంకేపుడు అనుభవిస్తాం అని సమర్దిన్చుకుంటారు. కాలేజి రోజులన్నీ హ్యాపీడేస్ గా భావిస్తుంటారు. నిజమే ! అవి హ్యాపీడేసే. కానీ దేనికైనా ఒక హద్దుంటుంది. హద్దు దాటితే అవి బాడ్ డేస్. ఈ సత్యం తెలుసుకోకుండా పిచ్చి చేష్టల్ని హిరోయిజంగా భావిస్తూ గడిపేస్తే రాబోయే రోజులన్నీ విషాదకరమైన రోజులే.
- జక్కని రాజు
9440469097