మనసుకు బాధ కలిగినపుడు /బాధ నుండి బయట పడటం ఎలా ?

అసలు మనకు బాధ ఎందుకు కలుగుతుంది…?

  • సూటిగా చెప్పాలంటే ..మనం అనుకున్నదానికి విరుద్దంగా జరిగినపుడు
  • కోరుకున్నది దక్కనప్పుడు
  • మన ప్రణాళిక తప్పినప్పుడు

కొన్ని సందర్భాలు

Ø  విద్యార్ధి పరీక్షా తప్పినప్పుడు

Ø  ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కానపుడు

Ø  కోరుకున్న కాలేజిలో సీటు రానపుడు

Ø  ఇతరులు తనని గుర్తించనపుడు

Ø  తనని తాను తక్కువగా అంచనా వేసుకున్నపుడు

Ø  ఆత్మ విశ్వాసం లోపింఛినపుడు

Ø  ఇంట్లో బయట తనని అర్థం చేసుకోవడం లేదని భావించినపుడు

Ø  అవమానం కలిగినపుడు

Ø  ప్రేమలో విఫలమైనపుడు   ఇంకా ఎన్నో ఎన్నెన్నో……..

బాధ నుండి బయట పడటం ఎలా..?

బాధకి కారణం ఏమైనప్పటికీ పరిష్కారం మాత్రం ఒక్కటే. పరిస్తితిని అర్థం చేసుకోవడం. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయమేంటంటే అందరూ పరిస్తితిని అర్థం చేసుకున్నానని అనుకుంటారు. కానీ అది వారి కోణం లో మాత్రమే. ఇదే సమస్యకు అసలు కారణం. పరిస్తితిని మనవైపునుండే కాకుండా, ఆ వైపు నుండి కూడా నిజాయితిగా ఆలోచిస్తే అసలు విషయం అర్థమై బాధ తగ్గుముఖం పడుతుంది. మనలో లోపాలేమైనా వుంటే వాటిని సరిదిద్దుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం లేదా సమస్యకు కారణం ఎదుటి వ్యక్తి అని భావించినపుడు అనవసరంగా అతడి గురించి ఏదేదో ఊహించుకుని బాధ పడే బదులు సూటిగా ప్రశ్నించి  మన అనుమానాలను నివృత్తి చేసుకోవడం మంచిది.

కొంత మంది బాధను రోజుల తరబడి, నెలల తరబడి, ఇంకొందరు మహానుభావులు సంవత్సరాల తరబడిగా కొనసాగిస్తూనే వుంటారు. ఇది చాలా ప్రమాదకరం బాధతో జీవనం కొనసాగిస్తే దానివల్ల స్ట్రెస్, బిపి, షుగర్ లేదా డిప్రెషన్ వచ్చే అవకాశం వుంది. అందుకనే మనలోని బాధని ఎంత త్వరగా పుల్ స్టాప్ పెడితే అంత మంచిది. త్వరగా బాధ నుండి విముక్తి పొందాలంటే సమస్యను బర్డ్ యాంగిల్లో చూసే అలవాటు చేసుకోవాలి.

బాధ పదునైన ఆయుధం

బాధ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కత్తితో పళ్ళు కోయవచ్చు, ప్రాణాలు తీయవచ్చు. అంటే మనకు కలిగిన బాధను తలచుకుని క్రుంగి కృశించి పోవచ్చు లేదా ఆ బాధ నుండి వచ్చిన పౌరుషంతో అద్బుతాలు కూడా సాధించవచ్చు. అంటే మనకు కలిగిన బాధను నెగేటివ్ గా ఉపయోగిస్తే నేగేటివ్ ఫలితాలు వస్తాయి పాజిటివ్ గా ఉపయోగిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి ఈ విషయం అర్థమైతే బాదే లేదు. 

బాధను పాజిటివ్ గా మలచుకోవాలి

  • బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను అమెరికా విమానాశ్రయంలో అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అనుమానంతో ఒళ్ళంతా తడిమి చూసి అవమానించాబఫరు. ఇలా జరగడం రెండోసారి. దీనికి షారుఖ్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాకు పొగరు ఎక్కువైందని అనిపించినప్పుడల్లా అమెరికాకు వస్తుంటాను, వారు నా స్టార్ డమ్ లోని స్టార్ ని పీకేసి పంపిస్తుంటారు. అని ఛలోక్తి విసిరాడు. చూశారా! షారుఖ్ తన లోని బాధను పాజిటివ్ గా ఎలా మలచుకున్నాడో.
  •    మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా లో రైలు లో ప్రయాణిస్తున్నప్పుడు బోగిలోని ఇంగ్లాండ్ దేశస్తులు ఆయన్ని రైలులో నుండి తోసేసిన సంగతి అందరికి తెలిసిందే కదా!అప్పుడాయన బాధతో ఏడుస్తూ కూర్చోక మీరు నన్ను కేవలం రైలులో నుండి మాత్రమే తోసేసారు కానీ నేను మిమ్మల్ని నా దేశం నుండే తోసేస్తానని శపథం చేసాడు.
  • అమితాబ్ బచ్చన్ హిరో అవుదామని వచ్చిన కొత్తలో అయన హైటూ, స్వరమూ చూసి నిర్మాతలు, దర్శకులు విరగబడి నవ్వారు. ఆ సమయంలో అనుభవించిన బాధను అయన పట్టుదలగా మలచుకుని హిరో అయ్యి, నవ్విన వారినే తన ఇంటి ముందు క్యూ కట్టేలాచేశాడు.
  • మహాభారతంలో దుర్యోధనుడు మయసభలో ద్రౌపతి నవ్వు వలన కలిగిన బాధను నెగెటివ్ గా మలచుకుని కురుక్షేత్ర మహా సంగ్రామానికి తెరలేపి, కౌరవ వినాశనానికి కారకుడయ్యాడు.

అందుకు మనకు కలిగిన బాధను పాజిటివ్ గా మలచుకుంటే పాజిటివ్ ఫలితాలు నెగెటివ్ గా మలచుకుంటే నెగెటివ్ ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది.

                   పాజిటివ్ దృక్పథం తో పాటు మెడిటేషన్, ప్రాణాయామం, రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా కూడా మానసికంగా ఉపశమనం పొందవచ్చు. ఇంకా మంచి సంగీతం వినడం వల్ల, ప్రశాంతమైన ప్రదేశాలు అనగా దేవాలయాలు పార్కులు సందర్శించడం వల్ల మనసు కుదుటపడుతుంది. ఇంకా ఆత్మీయులతో సన్నిహితంగా గడపడం వల్ల కూడా బాధనుండి విముక్తి పొందవచ్చు. ఎవరి వీలుని బట్టి వారు ఏదో ఒక పద్దతి ఎంచుకోవచ్చు.

                   ముఖ్యంగా నేటి యువతలో కొందరు ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని దిగులు చెందుతున్నారు. కొందరు ఎన్ని సబ్జెక్టులు తప్పినా డోంట్ కేర్ అనుకుంటే, ఇంకొందరు డిప్రెషన్ తెచ్చుకుంటున్నారు. మరికొందరు పరీక్ష తప్పితే మళ్లి రాసి పాసయ్యే అవకాశం ఉందన్న స్పృహ కూడా లేకుండా జీవితమే వేస్ట్ అన్నంతగా చింతిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో యువతీ యువకులు ఎక్కువగా బాధను కొని తెచ్చుకుంటున్నారు. విద్యాలయాలు ప్రేమలయాలుగా మారిపోయాయి. కాలేజిల్లో చదువు ఎంత వరకు నేర్చుకుంటున్నారో  గానీ ప్రేమ     పాఠాలకు మాత్రం  కొదవలేదు. కానీ అన్ని కథలు సుఖాంతం కాలేవు గదా! చాలా మంది ప్రేమ బాధల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియక ఎవరికీ చెప్పాలో తెలియక పరిష్కారానికై మాలాంటి కౌన్సిలర్ల వద్దకు పరుగెత్తేవారు కొందరైతే, మరికొందరు తమలో తామే దిగులు చెంది ప్రేమ, చదువు, కెరీర్ అన్నీ కోల్పోయి తల్లిదండ్రులకు బాధను మిగిలించేవారు కొందరైతే, ఆత్మహత్య చేసుకునేవారు మరికొందరు. చదువులో కానీ, ప్రేమలోగాని, ఇంటర్వ్యూ లో గాని ఓటమి వల్ల వచ్చే బాధను అనుభవం నేర్పిన ఒక గుణపాఠంగా తీసుకుంటే బాధే ఉండదు. మనం అనుకున్నవన్నీ జరిగి తీరాలంటే కుదరదు. ప్రయత్నం మాత్రమే మనది. అందుకే అన్నారు జయాపజయాలు దైవాదీనాలు అని. మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. ఫలితం ఇప్పుడుకాకున్నా మరోసారి లభిస్తుందన్న ఆశాభావంతో ముందుకు సాగాలి.

మనిషి జీవితం వడ్డించిన విస్తరి కాదు అదో సమస్యల వలయం. నేటి పోటి ప్రపంచంలో వత్తిడి బాధ లేని జీవితాన్ని ఉహించలేము. గెలుపోటములు అవమానాలు అడ్డంకులు ఇవన్ని అందరికీ ఉంటాయి. ఎవరైతే అన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కుంటారో వారే విజేతలు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మన గోప్పతనమేముంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే జీవితం చప్పగా వుంటుంది. జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే.  అల్ ది బెస్ట్ . 
                                                                             -   జక్కని రాజు